ఐదు రోజుల పాటు అంబరాన్నంటేలా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇవాళ్టీతో ముగియనున్నాయి. ఎల్భీస్టేడియంతో పాటు.. రవీంధ్రభారతి, తెలుగు యూనివర్సిటీ, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి కోవింద్, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఇక ముగింపు వేడుకల్లో.. తెలంగాణ సాహితీవైభవాన్ని చాటి చెప్పేందుకు పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారని తెలుస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ తీర్మానం చేయనున్నారు. ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులో వచ్చేలా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల బోర్డులు తెలుగులో తప్పనిసరి ఉండేలా తీర్మానించనున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీలో బయల్దేరి 3.40 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలమేరకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారుచేసింది.