ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు. బుధవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. తన వైకల్యం శరీరానికే కానీ తన ఆలోచనలకు కాదని మొక్కవోని అకుంఠిత దీక్షతో విశ్వం పుట్టుక,కృష్ణ బీలాలకు సంబంధించి అనేక పరిశోధనలు చేశారు.
తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా… మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1966లో ఆయన సమర్పించిన‘ప్రొపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివర్సెస్’ థీసిస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దానిని చదివేందుకు ఆసక్తి చూపారు. కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ… కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
2014లో హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సోషల్ మీడియాలో చేరిన క్షణాల్లోనే ఆయన మిలియన్ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇక స్టీఫెన్ హాకింగ్ చేసిన తొలి పోస్ట్‌కు క్షణాల్లో ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. అంతరిక్ష కేంద్రంలోని ఆస్ట్రోనాట్‌లకు మూడేళ్ల క్రితం మీరు చెప్పినట్టుగా.. సూపర్ మ్యాన్‌లా మైక్రోగ్రావిటీలో ఎగిరిపోండని నాసా ట్వీట్ చేసింది.
మరణం గురించి ఆయన మాటల్లో….
“మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం,స్వర్గం , నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి”.