పాక్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింన భారత్‌..

84
- Advertisement -

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఫలితంగా దాయాది పాక్ ముందు టఫ్ టార్గెట్‌ను సెట్ చేసింది. భారత బ్యాటర్లు స్మృతి మంధాన, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ అర్ధ సెంచరీలతో చేలరేగిపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ అనంతరం స్మృతి మంధాన అవుటైన తర్వాత భారత్ వడివడిగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడినట్టు కనిపించింది.

అయితే, స్నేహ్‌ రాణా, పూజా వస్త్రాకర్ క్రీజులో పాతుకుపోయి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో భారీ స్కోరు నమోదు చేశారు. స్నేహ్ రాణా 48 బంతుల్లో 4 ఫోర్లతో 53 పరుగులు చేయగా, పూజా వస్త్రాకర్ చెలరేగింది. 59 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు చేసి పాక్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ 40 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (5), రిచా ఘోష్ (1) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో నిదా దార్, నష్రా సంధు చెరో రెండు వికెట్లు తీసుకోగా, డయానా బేగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.

తొలిపోరులోనే పాక్‌తో భారత్‌ తలపడుతుండడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ నేతృత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఎలాగైనా ఈ సారి కప్పు కొట్టాలని దృఢనిశ్చయంతో ఉంది. వన్డేల్లో భారత్‌కు పాక్‌ జట్టుపై తిరుగులేని రికార్డు ఉంది. పాక్‌తో తలపడిన పదిమ్యాచుల్లో భారత్‌ విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ రెండుసార్లు పాక్‌ను ఓడించింది.కెప్టెన్‌ మిథాలీతో పాటు వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామికి ఇదే చివరి ప్రపంచకప్‌ అయిన నేపథ్యంలో.. కప్పుతో వీళ్లకు వీడ్కోలు పలకాలని జట్టు పట్టుదలతో ఉంది. పాక్‌పై ఘన విజయంతో శుభారంభం చేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది.

- Advertisement -