దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో 2026 మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తదుపరి మ్యాచ్ ఉండటంతో….సెమీస్ చేరాలంటే భారత్ ఖచ్చితంగా వారిని ఓడించాల్సి ఉంటుంది. షఫాలీ వర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ ఆ ఊపును అందుకోవడంలో మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో భారత్ ఇన్నింగ్స్ 158/7 వద్ద ముగిసింది.
లక్ష్య ఛేదనలో 2023, 2024 రన్నరప్ అయిన దక్షిణాఫ్రికాను భారత్ 10 ఓవర్ల వరకు బాగానే కట్టడి చేసింది. 10 ఓవర్లలో ఆ జట్టు 59/2 తో నిలిచింది.
చివరి 60 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్‌రౌండర్ మరిజానే కాప్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడింది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో తన జట్టును గెలిపించింది. కాప్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను రాధా యాదవ్ వదిలేయడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్న కఠినమైన గ్రూప్-ఎ లో భారత్ ఉంది. ఇక్కడ ఒక్క తప్పిదానికి కూడా తావు లేదు. ఇప్పటివరకు పాకిస్తాన్, నెదర్లాండ్స్ వంటి బలహీనమైన జట్లను ఓడించి అజేయంగా నిలిచిన భారత్ తమతో సమానమైన బలమున్న దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి అసలైన పరీక్షలో విఫలమైంది.
భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే నాలుగు మ్యాచ్‌లు సెమీస్ చేరే ఆ రెండు జట్లను నిర్ణయించనున్నాయి.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ – జూన్ 25
దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ – జూన్ 25
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా – జూన్ 28
దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ – జూన్ 28
Also Read:కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!
భారత్ సెమీస్ చేరాలంటే జూన్ 25న బంగ్లాదేశ్‌ను అలాగే జూన్ 28న ఆస్ట్రేలియాను ఓడించి 5 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించాలి. దక్షిణాఫ్రికా కూడా రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్‌తో సమానంగా పాయింట్లు సాధిస్తుంది, అప్పుడు నెట్ రన్ రేట్ (NRR) కీలకంగా మారుతుంది. అయితే దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా, భారత్‌లతో ఆడాల్సిన కఠినమైన మ్యాచ్‌లను ముగించుకుంది. కానీ భారత్‌కు బంగ్లాదేశ్‌తో సులువైన మ్యాచ్ ఉన్నప్పటికీ, బలమైన ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మ్యాచ్ పెద్ద సవాల్‌గా మారనుంది.

