బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

1
- Advertisement -

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రధాన మంత్రి పదవికి అలాగే లేబర్ పార్టీ నాయకత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటించారు. సొంత పార్టీ నుంచే వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో లేబర్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను కేర్‌టేకర్ (తాత్కాలిక) ప్రధాన మంత్రిగా కొనసాగుతానని స్టార్మర్ తెలిపారు.

ఆయన తన భార్యతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలికి రాగా అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. అనంతరం ఆయన ప్రధాని నివాసం వెలుపల నిలబడి అధికారికంగా రాజీనామా ప్రకటన చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడానికి నేను సరైన వ్యక్తినేనా? అనే ప్రశ్న ఇప్పుడు నా పార్టీ ముందుంది. ఈ ప్రశ్నకు నా పార్లమెంటరీ పార్టీ ఇచ్చిన సమాధానాన్ని నేను విన్నాను, దానిని గౌరవప్రదంగా అంగీకరిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నేను అమితంగా ప్రేమించే నా దేశ ప్రయోజనాల కోసమే. అందుకే నేను లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నాను అని స్టార్మర్ పేర్కొన్నారు.

తన నిర్ణయం గురించి సోమవారం ఉదయమే కింగ్ చార్లెస్ 3కి కూడా సమాచారం అందించినట్లు స్టార్మర్ తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కావడం తన జీవితంలోనే “అత్యంత గర్వించదగ్గ క్షణం” అని ఆయన అన్నారు.

ALso Read;కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!

అధికార మార్పిడి ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా చూస్తానని అలాగే తన తర్వాత రాబోయే కొత్త ప్రధానికి పూర్తి మద్దతు ఇస్తానని స్టార్మర్ చెప్పారు. తన ప్రసంగం ముగిసే సమయంలో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై తాను తన కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెడతానని, ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉంటానని అన్నారు.

- Advertisement -