ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..

188
- Advertisement -

ఆర్థికశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు నోబెల్ బ‌హుమ‌తి పొందారు. ఒక సగం డేవిడ్ కార్డ్ కు, మిగతా సగం జాషువా డి ఆంగ్రిస్, గిడో డబ్ల్యూ ఇంబెన్స్ లకు పంచారు. డేవిడ్ కార్డ్ కార్మిక రంగ ఆర్థిక స్థితిగతులపై అనుభవవేద్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించగా… ఆంగ్రిస్, ఇంబెన్స్ లు ఆర్థిక నేపథ్యంలో సాధారణ సంబంధాల విశ్లేషణకు సిద్ధాంతపరమైన భాగస్వామ్యం అందించారు. వీరు రూపొందించిన డేటా మోడళ్లు అనేక పరిశోధనలకు ఊతమిచ్చాయి.

ఈ ఏడాది నోబెల్ విజేతల్లో ఒకరైన డేవిడ్ కార్డ్ కెనడియన్ అమెరికన్ కార్మిక రంగ ఆర్థిక నిపుణుడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక జాషువా ఆంగ్రిస్ట్ ఇజ్రాయెల్ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త. ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంగ్రిస్ట్ తో పాటు నోబెల్ ప్రైజ్ లో ఓ భాగాన్ని పంచుకున్న గిడో ఇంబెన్స్ డచ్ అమెరికన్ ఆర్థికవేత్త. ఆయన ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

స‌హ‌జ ప‌రిశోధ‌న‌ల ద్వారా ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్ర‌వేత్తలు సంచ‌ల‌నాత్మ‌క అంశాల‌ను వెల్ల‌డించారు. సామాజిక శాస్త్రంలో చాలా వ‌ర‌కు అంశాల్లో.. కార‌ణం ఏంటి, దాని ప్ర‌భావం ఏంట‌న్న రీతిలోనే ఉంటాయి. అయితే అలాంటి విష‌యాల‌పై ఈ ముగ్గురూ కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇమ్మిగ్రేష‌న్ వ‌ల్ల జీతంపై ప్ర‌భావం ఉంటుందా.. ఉద్యోగంలో మార్పు ఎలా ఉంటుంద‌న్న లాంటి అంశాల‌ను స్ట‌డీ చేశారు. పెద్ద చ‌దువులు చ‌దవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆదాయం ఎలా ఉంటుంది. నిజానికి ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెత‌క‌డం ఈజీ కాదు. అయితే ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు స‌హ‌జ‌మైన రీతిలో స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

- Advertisement -