దేశమంతా గులాబీ పరిమళం వెదజల్లుతామని తెలిపారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ 17వ ప్లీనరీ సందర్భంగా మాట్లాడిన సీఎం కాంగ్రెస్,బీజేపీలపై దుమ్మెత్తి పోశారు. హైదరాబాద్ వేదికగా దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటనతో కాంగ్రెస్,బీజేపీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ వాళ్లను , కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీని నిందిస్తూ పబ్బం గడపతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీన్ దయాళ్ పేరు పోయి రాజీవ్ గాంధీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి ఇందిరా గాంధీకి పథకాలు పేర్లు మాత్రమే మారతాయని…. కుంభకోణాలు మాత్రం యథావిధిగా మరో రూపంలోకి కొనసాగుతాయన్నారు.
ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపిన కేసీఆర్ తాను చేసిన ప్రకటనతో ప్రకంపనలు వచ్చాయన్నారు. కేసీఆర్…మోడీ ఏజెంట్ అని రాహుల్ గాంధీ….టెంటే లేదు…ఫ్రంట్ ఎలా ఏర్పాటు చేస్తారని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని వారికి కేసీఆర్ అంటే భయమన్నారు. ఆశారాం బాపూజీ,గుర్మిత్,నీరవ్ మోడీల్లాంటి కేడీలు దేశాన్ని నాశనం చేశారని తెలిపారు.
ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశంలో 40 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్లే దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని, రైతాంగం సమస్యలను పరిష్కరించేందుకు బృహర్త ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ర్టాల మధ్య, ప్రాంతాల మధ్య యుద్ధాలు పెట్టి, కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయని ఆరోపించారు.