ప్రజలు కరోనా వైరస్‌పై రోజురోజూకీ అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ గృహిణి తన భర్తకు కరోనా పరీక్షలన్నీ పూర్తయ్యాకే కాపురం చేయాలంటూ షరతు పెట్టింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన.
తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చాడు భర్త. తెలంగాణ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండడంతో అక్కడి నుంచి వచ్చిన భర్తను ఇంట్లోకి రాకుండా అడ్డుకుందా ఇల్లాలు. కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లో అడుగుపెట్టాలని సూచించింది.
ఒకవేళ వైరస్ సోకి ఉంటే అది తనకు, తన పిల్లలకు సోకుతుందని, కాబట్టి పరీక్షలు చేయించుకుని, వైరస్ సోకలేదని తేలిన తర్వాతే ఇంట్లోకి రావాలని భర్తను కోరింది. అతడు వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.
ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కాగా ఇప్పటికే ఏపీలో 19,తెలంగాణలో 67 కరోనా కేసులు నమోదయ్యాయి.