కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు మరియు ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు త్వరలోనే తెరపడనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కె. మురళీధరన్ ధీమా వ్యక్తం చేశారు.
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) విజయం సాధించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీలో అంతర్గత చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. రేపటి కల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని ఆయన మీడియాకు తెలిపారు.
ఈ విజయం కేరళ ప్రజల విజయమని, సుస్థిరమైన మరియు అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.కేరళ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. విడిసతీశన్ ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన పోరాటం, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన పోషించిన పాత్ర ఆయనకు కలిసి వచ్చే అంశం.
Also Read:రష్యా-ఉక్రెయిన్ వార్..కీలక పరిణామం
కె. సుధాకరన్..కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఏఐసీసీ (AICC) పరిశీలకులు ఇప్పటికే కేరళకు చేరుకుని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఈ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరగనున్నాయి.

