తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న బండి సంజయ్ కుమారుడు ఒక వివాదాస్పద కేసులో చిక్కుకోవడం ఆ పార్టీని రక్షణలో పడేసింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రావడం, దానిపై POCSO చట్టం కింద కేసు నమోదు కావడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా ఖంగుతిన్నది.
సాధారణంగా పార్టీలోని కీలక నేతలపై ఎలాంటి చిన్న విమర్శ వచ్చినా మూకుమ్మడిగా దాడి చేసే బీజేపీ శ్రేణులు, ఈ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 7 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ కేసుపై ఒక్కరంటే ఒక్కరు కూడా బండి సంజయ్‌కు మద్దతుగా అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పార్టీ వింగ్‌లు కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇది రాజకీయపరమైన కక్షసాధింపు చర్య అని చెప్పడానికి వీలులేని విధంగా, మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం. ఇలాంటి కేసుల్లో బహిరంగంగా మద్దతు ఇస్తే మహిళా ఓటర్లలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్టీ భావిస్తోంది.
పోక్సో చట్టం నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. విచారణ ప్రాథమిక దశలో ఉండగానే “క్లీన్ చిట్” ఇవ్వడం భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని అధిష్టానం యోచిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒకచోట తప్పు జరిగి ఉండవచ్చని పార్టీ అంతర్గత విచారణలో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విచారణ పూర్తయ్యే వరకు “వేచి చూసే ధోరణి” అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read:కేరళ సీఎం..రేసులో ఆ ఇద్దరు?
ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటే, పార్టీ కేడర్ మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉంది. బండి సంజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠకే కాకుండా, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీకి కూడా ఇది ఒక పరీక్షా సమయంగా మారింది.

