యూజర్లను భయపెడుతున్న వాట్సాప్..

248
WhatsApp
- Advertisement -

ప్రెజెంట్ వాట్సాప్ మన జీవితంలో భాగమై పోయింది.. పొద్దున లేచినదగ్గరనుంచి చాలా మందికి వాట్సాప్ స్టేటస్‌లు, చాటింగ్‌లతోనే జీవితం సాగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం మన దేశంలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ను యూజ్ చేస్తున్నారు. అయితే యూజర్ ఫ్రెండ్లీ‌గా అయిన వాట్సాప్ ఇప్పుడు దడ పుట్టిస్తోంది. దీనికి కారణం వాట్సాప్ కొత్తగా ప్రైవసీ రూల్స్ తీసుకువచ్చింది. రీసెంట్‌గా వాట్సాప్ ఓపెన్ చేయగానే మీకు కొత్త ప్రైవసీ రూల్స్ పాప్ అప్ మెసేజ్ కనిపించిందా…ఆ మెసేజ్‌ను చదవకుండా యాక్సెప్ట్ చేశారా ఇక అంతే సంగతులు. వాట్సాప్‌ మేనేజ్‌మెంట్‌ మెల్లగా మన వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. అందుకే కొత్తగా ప్రైవసీ రూల్స్‌ను తీసుకువచ్చింది. యూజర్లు తమ డేటాను ఫేస్‌‌బుక్‌‌తో షేర్ చేయాలని లేకపోతే వారి అకౌంట్లను డిలీట్ చేస్తామని వాట్సాప్ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన వారి అకౌంట్లను కొనసాగిస్తామని లేకపోతే డిలీట్ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన మెసేజ్‌‌లతో యూజర్లకు అగ్రీ అనే అలర్ట్ ఆప్షన్ వస్తోంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే వచ్చే నెల 8 నుంచి కొత్త ప్రైవేట్ పాలసీ ఆప్షన్‌‌ను అనుమతించినట్లే.

అసలు వాట్సప్ అంటే ఫస్ట్ నుంచి ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తుందనే పేరు ఉంది.. అందుకే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం మరో కారణం. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే మీరు పంపిన మెసేజ్ అవతలివారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందుకే వాట్సప్ యూజర్ల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మీరు ఈ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేస్తే మీ డేటా వివరాలను వాట్సాప్‌ ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తుంది. అంతే మీ వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో వివరంగా ఉన్నాయి. అంతే కాదు మీరు ఈ కొత్త ప్రైవసీ రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సాప్‌కి తెలుస్తాయి. యూజర్ల డేటాను ఫేస్‌‌బుక్‌‌తోపాటు మరికొన్ని యాప్స్, సర్వీసుల్లో షేర్ చేస్తామని వాట్సాప్ తెలపడంపై చాలా మంది యూజర్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవసీ పాలసీ నచ్చనివారు వాట్సాప్ నుంచి క్విట్ అవుతున్నారు.

అయితే వాట్సాప్ యాజమాన్యం మాత్రం మీ వ్యక్తిగత వివరాలు బిజినెస్ పర్సస్‌లో మాత్రమే షేర్ అవుతాయి తప్ప..ఇతరత్రా ప్రైవసీకి భంగం కలుగదని చెబుతోంది. ఎప్ప‌టిలాగే త‌మ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వాట్సాప్‌లో సేవ‌ల‌ను ఉపయోగించుకోవ‌చ్చ‌ని, చాటింగ్ చేయ‌వ‌చ్చ‌ని అంటోంది. వాట్సాప్‌ను ఉప‌యోగించుకునే తీరుపై కొత్త పాల‌సీల ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని, క‌నుక యూజ‌ర్లు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేస్తోంది..ప్రెజెంట్ అయితే వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్‌పై యూజర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొత్త ప్రైవసీ రూల్స్‌ను అంగీకరించని ఫోన్‌లో వాట్సాప్ సేవలు ఆగిపోతాయని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. దీంతో కొత్త రూల్స్‌ను అంగీకరించాలా లేదా అనే విషయమై యూజర్లలో గందరగోళం నెలకొంది. వాట్పాప్ యాజమాన్యం ఈ కొత్త ప్రైవసీ రూల్స్‌పై వినియోగదారులకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వాట్సాప్ నుంచి యూజర్లు టెలిగ్రామ్ వంటి యాప్‌లకు మళ్లడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -