సిడ్నీ టెస్టులో భారత్‌కు భారీ టార్గెట్..

39
India vs Australia

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 407 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ ఓపెనర్స్ ఇద్ద‌రి వికెట్స్ కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో పడింది. ఇక ఈ మ్యాచ్‌కు మ‌రో రోజు మిగిలి ఉండ‌గా, భార‌త్ విజ‌యం సాధించాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా విజ‌యం కోసం ఎనిమిది వికెట్స్ కావ‌ల‌సి ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా(9).ర‌హానే(4) ఉన్నారు. ఆటకు మరొక్క రోజు మాత్రమే మిగిలుండగా, టీమిండియా ఆశలన్నీ ఈ జోడీపైనే ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ 52, శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ కావడంతో పుజారా, రహానే బరిలో దిగారు. ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో హాజిల్ వుడ్‌, క‌మ్మిన్స్‌కు చెరో వికెట్ ద‌క్కింది.

ఆదివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 47తో ఈరోజు బ్యాటింగ్‌ని కొనసాగించిన మార్కస్ లబుషేన్ (73: 118 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీ నమోదు చేసి నవదీప్ సైనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత మాథ్యూవెడ్ (4: 11 బంతుల్లో 1×4)ని కూడా సైనీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆస్ట్రేలియా 10 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. స్మిత్‌(81), గ్రీన్(84),పైన్(39) రాణించ‌డంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోను భారీ స్కోరు చేసింది. టీ బ్రేక్‌కి ముందు గ్రీన్ ఔటవగా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, సైనీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రాకి ఒక వికెట్ దక్కింది.