వాట్సప్ ….సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న యాప్ . రాత్రనకా పగలనక ఎప్పుడు పడితే అప్పుడు నేటి యువత వాట్సప్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సాప్ మరో రెండు కొత్త సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇటీవలే వాట్సాప్ పేమెంట్స్‌ను అప్‌డేట్‌గా అందించిన ఈ సంస్థ .. తాజాగా వీడియోకాల్ నుంచి వాయిస్ కాల్‌కు మారే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియో కాల్ నుంచి వాయిస్ కాల్‌కు .. వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కు మారే సౌలభ్యం ఉంటుంది. కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్‌పై స్విచ్ ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే అవతలివారికి మీరు వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కు మారాలనుకుంటున్నట్లుగా నోటిఫికేషన్ వెళ్తుంది. దాన్ని అవతలివారు అంగీకరించగానే వాయిస్ కాల్ నుంచి వీడియోకాల్‌కు మారిపోతారు.
దీంతో పాటు గ్రూప్‌లో పోస్టు చేసిన మెసేజెస్‌లో రీడ్ చేయని వాటిని ‘@ ’ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అంతేకాదు గ్రూప్‌లోని మరొకరిని మెన్షన్ చేస్తూ మెసేజ్ చేయచ్చు. అయితే ప్రస్తుతం ఈ అప్‌డేట్ కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్స్‌ను ఉపయోగించుకునేందుకు లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ ఇటీవలే పేమెంట్స్ ఆప్షన్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది.