పెళ్లి అనే పేరుతో ప్రతి ఆడపిల్ల మరొకరి ఇంట కోటి ఆశలతో అడుగుపెడుతుంది. అప్పటివరకూ తల్లిదండ్రుల గారాబాన్ని మాత్రమే ఎరిగిన ఆడపిల్ల, భార్యగా … కోడలిగా,వదినగా కొత్త ప్రదేశం, పరిచయంలేని మనుషులు, వివిధరకాల మనస్తత్వాలు కలిగిన అందరి మెప్పుపొందేలా నడుస్తుంది.
ఉత్సాహంతో అత్తగారిల్లే సర్వంగా భావిస్తూ పనులు చేసుకుంటూ వెళుతుంది. తనకోసం అందరినీ వదులుకుని వచ్చిన భార్యను సంతోషపెట్టడం భర్త ధర్మం. అప్పటివరకూ ఆమె తొలిప్రాధాన్యతను ఇచ్చిన వాటన్నింటికీ, వివాహమయ్యాక భర్త తరువాత స్థానాన్నిఇస్తుంది.
అలాంటి భార్య విశాలహృదయాన్ని భర్త అర్థంచేసుకోవాలి.ఎందుకంటే భర్త పుస్తకాల్ని మాత్రమే చదువుతాడు కానీ భర్తను సైతం చదివేది భార్య.భార్యదే నిజమైనచదువు.చిన్నప్పుడు తల్లిదండ్రులను, చదువుకున్నప్పుడు స్నేహితులను,కలిసిమెలిసి తిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని చదువుతుంది.
పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది.తన కుటుంబ సభ్యులను చదువుతుంది.పరిసరాలనుచదువుతుంది.అందుకే భర్తకు తన గురించి తనకు తెలియని విషయాలెన్నో భార్యకు తెలుసు.
అందుకే అనేక త్యాగాలకు ప్రతిరూపంగా నిలిచిన భార్య సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇంట సంపదలు … విజయాలు స్థిరంగా ఉంటాయని పెద్దలు చెబుతారు. పురాణాలలోను … ఇతిహాసాల్లోనూ భార్యకి ఇవ్వబడిన అనురాగభరితమైన స్థానం ఇవ్వబడింది. అందుకే భార్య గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.