దేశ రాజకీయ చరిత్రలో అరుదైన, సంచలనాత్మక పరిణామం చోటుచేసుకోనుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా న్యాయవాదిగా మారి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అంశంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
ఈ కేసులో ఆమె తరఫున ఇతర న్యాయవాదులు కాకుండా, తానే నేరుగా వాదించాలన్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థకు వ్యతిరేకంగా స్వయంగా కోర్టులో వాదించనున్న ఘటనగా ఇది చరిత్రలో నిలవనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమె, ఈ వ్యవహారం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే న్యాయ పోరాటమని వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయ, రాజకీయ వర్గాలు ఈ విచారణపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది మాత్రమే కాకుండా, మమతా బెనర్జీ కోర్టులో ఎలా వాదిస్తారన్న అంశం కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
Also Read:KTR:కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి

