తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయబోమని స్పష్టం చేశారు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ ఎప్పుడు చెప్పలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు. విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు.