ఓపెన్ ప్లాట్స్..VLT Tax కడితేనే రిజిస్ట్రేషన్!

1
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. తాజాగా ఓపెన్ ప్లాట్‌లకు VLT   ట్యాక్స్ పేరుతో డబ్బుల వసూలుకు సిద్ధమైంది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే తప్పనిసరిగా VLT (Vacant Land Tax) చెల్లించాల్సిందేనని నిబంధనలు విధించడంపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. VLT పన్ను చెల్లించకపోతే రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌కు కూడా అనుమతి ఇవ్వకపోవడం సామాన్య ప్లాట్ యజమానులను ఇబ్బందులకు గురిచేయడమేనని మండిపడింది. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది.

ప్రస్తుతం ఖాళీ స్థలాలపై క్యాపిటల్ విలువలో ఏటా 0.5 శాతం VLT పన్ను విధించడంపై ప్లాట్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. స్థలంలో ఇల్లు నిర్మించకపోయినా, దాని ద్వారా ఎలాంటి ఆదాయం రాకపోయినా ప్రతి సంవత్సరం పన్ను చెల్లించాల్సి వస్తోందని రియల్టర్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న ప్లాట్లపై వేల రూపాయల మేర పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయని తెలిపారు. దీనికి వడ్డీ, పెనాల్టీలు కూడా తోడవడంతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, రిటైర్మెంట్ అవసరాల కోసం జీవితకాల సంపాదనతో చిన్న చిన్న ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు ఈ పన్నుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఆదాయం లేని ఖాళీ స్థలాలపై ఇంత మొత్తంలో పన్ను విధించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం VLT నిబంధనల్లో పలు మార్పులు తీసుకురావాలని అసోసియేషన్ కోరింది. 200 గజాల్లోపు విస్తీర్ణం కలిగిన ఒకే ఒక్క నివాస ప్లాట్‌కు VLT నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న 0.5 శాతం పన్ను రేటును తగ్గించడంతో పాటు, భూమి వాస్తవ కొనుగోలు విలువ ఆధారంగా పన్నును నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. గతంలో పేరుకుపోయిన VLT బకాయిలపై వడ్డీ, పెనాల్టీలను రద్దు చేసి, ప్లాట్ యజమానులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం కల్పించాలని సూచించింది.

మరో కీలక డిమాండ్ ఏమిటంటే.. VLTIN లేకపోయినా ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని అసోసియేషన్ కోరింది. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత సంబంధిత స్థలానికి పన్ను అసెస్‌మెంట్ చేసేలా నిబంధనలను మార్చాలని తెలిపింది. అలాగే LRS ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న లేఅవుట్లలో VLT వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?

VLT అనేది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పన్ను విధానం మాత్రమేనని దానిని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సాధనంగా మార్చకూడదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ హితవు పలికింది. సామాన్య ప్లాట్ యజమానుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే VLT నిబంధనలపై సడలింపులు ప్రకటించాలని డిమాండ్ చేసింది.

- Advertisement -