ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పరిధిలో సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల సహకారంతో రేవంత్ రెడ్డి సోదరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను లిటిగేషన్ నుంచి తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి భూకబ్జాలు, చీకటి వ్యవహారాల వల్ల కాంగ్రెస్ పార్టీకి అంతులేని నష్టం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించాలని పరోక్షంగా సూచించారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరిపైనా ప్రత్యేకంగా వ్యవహరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read:ఎల్నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
క్రమశిక్షణ ముందు పార్టీలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. వారి వ్యాఖ్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పార్టీ పరంగా తగిన నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే వరుసగా విమర్శలు చేస్తుండటం తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ వేడిని పెంచుతోంది.

