తమిళ హీరో విశాల్ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. సినీనటుడు విశాల్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. ఒట్టి మాటలు చెబుతూ ఊదరకొట్టకుండా ప్రజలకు గట్టిమేలు తలపెట్టేలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఔదార్యాన్ని చూపిన విశాల్ తాజాగా మరో మంచి పని చేయడానికి సిద్ధమయ్యాడు.
అది కూడా తెలుగు రాష్ట్రాల రైతుల కోసం. అభిమన్యుడు సినిమా లాభాల్లో ఒక టికెట్‌పై రూపాయి చొప్పున తమిళ రైతులకు ఆర్థికసాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. తెలుగులో కూడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి వచ్చిన లాభంలో కొంతశాతం రెండు తెలుగు రాష్ర్టాల్లోని రైతులకు అందించాలని కోరుతున్నాను అని అన్నారు విశాల్.
ఆయన కథానాయకుడిగా తమిళంలో నటించిన ఇరుంబు తిరై చిత్రం తెలుగులో అభిమన్యుడు పేరుతో ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. మిత్రన్ దర్శకుడు. సమంత కథానాయిక. జి. హరి నిర్మాత. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. విశాల్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ మొదలుకొని థియేటర్స్ యజమానుల వరకు అందరూ సంతోషంగా ఉన్నారు. నా కెరీర్‌లోనే అతిపెద్ద విజయమిది. తమిళంలో ఐదోవారంలో కూడా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతున్నది అని తెలిపారు.