రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో రెండు భారీ మైలురాళ్లను అందుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో విరాట్.. 8 ఫోర్ల సాయంతో 81 పరుగులు (44 బంతుల్లో) చేసి ఈ ఘనత సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదడం ద్వారా ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ (310) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.
ఐపీఎల్‌లో ఒకే జట్టు (RCB) తరపున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కూడా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. గుజరాత్ విధించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించారు. దేవదత్ పడిక్కల్ (55 పరుగులు) తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగళూరుకు 5 వికెట్ల విజయాన్ని అందించారు.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్
ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గానూ విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి.

