సౌతాఫ్రికా గడ్డపై రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ దూసుకెళ్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు మరో అరుదైన రికార్డు ఊరిస్తున్నది. క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు ఇప్పటివరకు ఒకే క్రికెటర్‌కు సాధ్యమైంది. అతడు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్. ఒకే టూర్‌లో వెయ్యి పరుగులు సాధించిన ఘనత అది. విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో ఒకే కాలంలో 900 అంతకంటే ఎక్కువ పాయింట్లతో ఉన్న బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటికే టెస్టుల్లో ఈ మార్క్‌ను అధిగమించిన కోహ్లి.. తాజాగా వన్డేల్లోనూ ఆ మైలురాయిని చేరుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్ అతడు. అతడి కంటే ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మాత్రమే ఈ రికార్డు అందుకున్నాడు.
టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో 900 అంతకంటే కంటే ఎక్కువ పాయింట్లు నమోదు చేసిన తొలి భారత ఆటగాడు కోహ్లినే. మొత్తం మీద అతడు ఐదోవాడు. వన్డే క్రికెట్ ఆల్‌టైమ్ ర్యాంకింగ్ పాయింట్ల జాబితాలో కోహ్లి (909).. బ్రయాన్ లారా (908)ను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి ఎగబాకాడు. విభాగంలో వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (935)దే నంబర్‌వన్ స్థానం. వన్డే కెరీర్‌లో సచిన్ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 558 పరుగులు సాధించిన కోహ్లి.. వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డివిలియర్స్ (844) రెండో స్థానంలో ఉన్నాడు.
శిఖర్ ధావన్ పదో స్థానం సాధించగా.. రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (947)దే అగ్రపీఠం. కోహ్లి (912) రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో సంచలన ప్రదర్శన సాగిస్తున్న అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (787) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానాన్ని కొల్లగొట్టాడు. భారత పేసర్ బుమ్రా (787)తో కలిసి అతడు అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. బౌలర్లలో నం.1 ర్యాంక్ సొంతం చేసుకున్న పిన్న వయస్కుడు రషీదే. అతడి వయసు 19 ఏళ్లు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 123 పాయింట్లతో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. అఫ్గాన్.. జింబాబ్వేను అధిగమించి వన్డేల్లో పదో స్థానం దక్కించుకుంది.