ప్రైవేట్ విద్యా సంస్థలు నైతిక బాధ్యతను మరవద్దు: వినోద్ కుమార్

119
b vinod kumar

వృత్తిలో ఉన్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ కు, ప్రైవేట్ నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించి.. వారిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ఆదివారం రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్ ను అధికారిక నివాసంలో కలిసి వారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిపుణులను, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్ లకు ఆయా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి నెల జీతాలు చెల్లించక పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.స్కిల్స్ ఉన్న వీళ్ళు టీచింగ్ రంగం నుంచి ఇతర రంగాలకు తరలిపోతే టీచింగ్ రంగానికి తీరని భారీ నష్టం జరుగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రతి నెలా జీతాలు చెల్లించి ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులకు ఉందని, ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదని వినోద్ కుమార్ సూచించారు.అవసరమైతే తెలంగాణ విద్యా చట్టం-82 లో సవరణలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు.ఈ చట్ట సవరణ ద్వారా ప్రతీ నెలా ప్రైవేట్ ఉపాద్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లకు ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు జీతాలు చెల్లించేలా చట్టం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రైవేట్ విద్యా సంస్థలలో వసూలు అయ్యే ట్యూషన్ ఫీజులలో మొదట టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు చెల్లింపులు జరిగేలా తెలంగాణ విద్యా చట్టంలో మార్పుల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 84 లో సమూల మార్పులతో జీతాలను చార్జ్ చేసే విధంగా విద్యా చట్టం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ లలో దాదాపు 52 శాతం మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన అన్నారు.వీరికి విద్యాబోధన చేస్తున్న ప్రైవేట్ ఉపాద్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు,ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లు వంటి నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులపై ఉందని వినోద్ కుమార్ నొక్కి చెప్పారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేసే వారి నుంచి వసూలు చేసిన డబ్బులను అదే అపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ఖర్చు చేసేలా తీసుకుని వచ్చిన ” రేరా ” చట్టం మాదిరిగానే .. ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు వసూలు చేసే ట్యూషన్ ఫీజు డబ్బులు ఆయా ప్రైవేట్ విద్యా సంస్థలలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లు, ప్రైవేట్ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాల కోసం ఫస్ట్ వెచ్చించేలా విద్యా చట్టం అవసరం ఎంతైనా ఉందని, ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో, స్కూళ్లలో ప్రైవేట్ లెక్చరర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఆయా సంస్థల యజమానులు ప్రతి నెలా జీతాలు చెల్లించేలా చూడాలని, తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 84 లో సవరణలు చేయాలని, జీ. ఓ. 45 లోని 14వ అంశాన్ని అమలు చేయాలని ప్రతినిధుల బృందం ఆ వినతిపత్రంలో వినోద్ కుమార్ ను కోరింది.ఈ ప్రతినిధి బృందంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐనేని సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేష్, మదన్, తదితరులు ఉన్నారు.