సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్‌తో పాటు మరికొంత మంది సర్పంచ్‌లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి సర్పంచ్‌ల సమస్యలను వివరించారు.
తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 8684 మంది సర్పంచ్‌లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని పేర్కిన్నారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుందని, ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ పాలన ప్రారంభమవుతుందన్నారు. స్పెషల్ ఆఫీసర్స్ పాలన మొదలైతే గ్రామ స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు.
గత ఐదేళ్లుగా సర్పంచ్‌లుగా కొనసాగుతున్న తమనే పర్సన్ ఇన్ ఛార్జీ సర్పంచ్ లుగా కొనసాగిస్తే ప్రభుత్వానికి మద్దతుగా మరికొంతకాలం సహకరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా వారిని కొనసాగించినట్లే తమను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్‌లు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వారికి హామీ ఇచ్చారు.