గురు సినిమాలో వెంకీ గానం..

440
venky
- Advertisement -

సినిమాలో హీరో, హీరోయిన్లు పాట పాడటం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తారలు సినిమాల్లో గాయకుల అవతారం ఎత్తుతున్నారు. తెలుగులో అయితే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు తమ గానాన్ని వినిపించారు. అప్పట్లో చిరంజీవి మాస్టర్ సినిమాలో ఓ పాట పాడాడు. రామయ్య వస్తావయ్యా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాకాసి రాకాసి అంటూ తన పాటతో హోరెత్తించాడు. అలాగే నాగ్ నిర్మలా కాన్వెంట్‌ లో పాట పాడాడు. ఇలా ఈ హీరోలంతా తమ గాత్రంతో అభిమానులను అలరించారు. ఇప్పుడు వెంకీ వంతు వచ్చినట్టుంది. గురు సినిమాలో వెంకటేష్ పాట పాడినట్టు తెలుస్తోంది.

venky

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా.. వెంకీ లేటెస్ట్ మూవీ గురు టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాటకు గురువు గారు సరదాగా స్టెప్పులేశారు. అయితే.. ‘జిగిడి జిగిడి’ అంటూ హమ్మింగ్ తో సాగుతున్న ఈ పాటను సరిగ్గా వింటే ఓ విషయం అర్ధమవుతుంది. ఇలా జిగిడి జిగిడి అంటూ హమ్ చేసినది ఎవరో కాదు.. మన వెంకీనే. అవును.. వెంకటేష్ తొలిసారిగా ఓ సినిమా కోసం పాట పాడాడన్న మాట. అయితే.. పాట మొత్తం పాడాడా.. లేక కేవలం ఈ బీట్ వరకే హమ్ చేశాడా అనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సీనియర్ హీరోలు తమలోని రకరకాల ట్యాలెంట్స్ ను ఇన్నేళ్లకయినా చూపించేస్తున్నారు.

వెంకీ బాక్సర్‌గా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో ఆ అంచనాలను మరింత పెంచేలా వెంకీచే ఓ పాట పాడించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ప్రయత్నం చేసిందట. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’కి రీమేక్‌గా ‘గురు’ను రూపొందిస్తున్నారు. రితికా సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తైంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -