దృశ్యం 2 రీమేక్‌లో వెంకీ..

29

మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన థ్రిల్లర్‌ మూవీ ‘దృశ్యం’ ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తర్వాత ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. శ్రీప్రియ తెరకెక్కించిన తెలుగు ‘దృశ్యం’లో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించారు. తెలుగులోనూ ‘దృశ్యం’ మంచి హిట్‌ను సాధించింది. తాజాగా దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 పేరుతో మూవీని తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశాడు. ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దృశ్యం సీక్వెల్ మాస్టర్ పీస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో దృశ్యం 2 చిత్రాన్ని రీమేక్ చేయాలంటూ వెంకీకు వ‌రుస మేసేజ్‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దృశ్యం 2 డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌, నిర్మాత సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులతో క‌లిసి వెంకీ దిగిన ఫొటోని విడుద‌ల చేశారు. దీంతో దృశ్యం 2 చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. కాగా, దృశ్యం 2 రీమేక్ రైట్స్‌ని సురేష్ బాబు ద‌క్కించుకున్న విషయం తెలిసిందే. మార్చిలో ఈ చిత్ర షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.