జూలై 25తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశ 15వ రాష్ట్రపతి ఎవరు కానున్నరనే దానిపై ఆసక్తికర చర్చనడుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రపతి ఎవరు అనేదానిపై పలు దఫాలుగా చర్చించింది బీజేపీ. అంతేగాదు మిత్రపక్షాల సలహాలు కూడా తీసుకుంది. ఇక విపక్షాలు సైతం రాష్ట్ర పతి అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. దీంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. ఎన్డీయేతర పార్టీలన్ని ఒకే అభ్యర్థిని ప్రకటిస్తే జేపీకి చిక్కులు తప్పకపోవచ్చు.
ఇక బీజేపీ నుండి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. వీరితో పాటు కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేరు కూడా ప్రధాని మోదీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఉపరాష్ట్రపతి రేసులో ముస్లింనేత, కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ ,కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ ,కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల నుండి మాజీ ప్రధాని దేవెగౌడ లేదా శరద్ పవార్‌లలో ఒకరిని ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.