అమెరికాలో జరిగిన ఒక విషాదకర సంఘటనలో తెలుగు రాష్ట్రానికి చెందిన యువతి స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. వర్జీనియాలో నివాసముంటున్న వీణ అనే యువతి ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
వర్జీనియాలో స్థిరపడిన వీణ, రెండు రోజుల క్రితం ఒక శుభకార్యం (ఫంక్షన్) నిమిత్తం ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ వద్ద అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ఆమె నీట మునిగిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
మృతి చెందిన వీణ తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి మరియు సునీత. వీరు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం, లింగోజిగూడ డివిజన్ పరిధిలో నివాసముంటున్నారు. గారాబంగా పెంచుకున్న కూతురు విదేశాల్లో మృతి చెందిందన్న వార్త తెలియగానే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read:కేరళ సీఎం..రేసులో ఆ ఇద్దరు?
విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. లింగోజిగూడలోని వారి నివాసానికి వెళ్లి దేవేందర్ రెడ్డి దంపతులను ఓదార్చారు. వీణ మృతదేహాన్ని వీలైనంత త్వరగా అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి, అవసరమైన పత్రాల ప్రక్రియను వేగవంతం చేసి మృతదేహాన్ని హైదరాబాద్‌కు చేర్చేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

