వీసా లేకుండానే ఉజ్బేకిస్తాన్ను భారతీయులు సందర్శించే అవకాశాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రవేశపెట్టనున్నట్టు భారతదేశంలోని ఉజ్బేకిస్తాన్ రాయబారి ఫర్హోద్ అర్జీవ్ వెల్లడించారు. హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన ఉజ్బేకిస్తాన్ రాయబారి ఫర్హోద్ నేడు నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను జిహెచ్ఎంసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఫర్హోద్ మాట్లాడుతూ.. ఉజ్బేకిస్తాన్ సందర్శించే పర్యాటకులకు ఇప్పటికే ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించామని తెలియజేశారు. ఉజ్బేకిస్తాన్ భారతదేశం మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తమ దౌత్య సంబంధాలు ఉన్నాయని, దీనికి నిదర్శనం తాస్కెంట్ ఒప్పందమని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో ఉజ్బేకిస్తాన్లోని బోహ్ర నగరంతో సిస్టర్ సిటీ ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోనున్నట్టు తెలిపారు.
బొహ్ర నగరానికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ రెండు నగరాల మధ్య సాంస్కృతిక, విద్య, వ్యాపార రంగాల్లో సత్సంబందాల ఏర్పాటుకు సిస్టర్ సిటీ అగ్రిమెంట్ దోహదపడుతుందని ఉజ్బేక్ రాయబారి వివరించారు. హైదరాబాద్ లోని చలనచిత్ర పరిశ్రమను ఉజ్బేకిస్తాన్‌కు ఆహ్వానిస్తున్నామని, ఉజ్బేక్లో ఎన్నో ఆకర్షనీయ, చారిత్రక, పర్యాటక కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉజ్బేక్ కు చెందిన ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉజ్బేక్ లో ఫార్మ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉజ్బేకిస్తాన్ రాయబారి ఫర్హోద్ అర్జీవ్ను నగర మేయర్ బొంతు రామ్మోహన్ చారిత్రక చార్మినార్ మెమోంటోతో ఘనంగా సన్మానించారు.
అనంతరం జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను ఉజ్బేక్ రాయబారికి చూపించి నగరంలో వర్షాలు, ట్రాఫిక్ తదితర నియంత్రణను పర్యవేక్షించే విధానాన్ని మేయర్ వివరించారు.