కరోనా నేపథ్యంలో చార్ ధామ్ యాత్ర రద్దు..

269
Char Dham Yatra
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చార్ ధామ్ యాత్రపై పడింది. బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల సందర్శనమైన చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు గురువారం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మే 14న ప్రారంభం కావాల్సి ఉన్న యాత్ర రద్దయిపోయినా.. ఆలయాల ద్వారాలు తెరుచుకునే ఉంటాయని.. భక్తులు లేకుండా పూజారుల మధ్యనే నిత్య పూజలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తెలిపారు.

కేసులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కుంభమేళాపై విమర్శలు వెల్లువెత్తినా.. చార్ ధామ్ యాత్రనూ నిర్వహించి తీరుతామని ఇటీవల సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రకటించారు. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాగా, అంతకుముందు కరోనా ఎఫెక్ట్‌తో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని చార్ ధామ్ యాత్ర కమిటీ ఉన్నతాధికారి చెప్పారు. ఏటా ఈ సమయానికి 500 బస్సుల నిండా ప్రయాణికులు యాత్రకు వచ్చేవారని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఒక్క బస్సు కూడా రాలేదని యాత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సుధీర్ రాయ్ అన్నారు.

- Advertisement -