ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం బెనిఫిట్ షోలకు గరిష్టంగా రూ.500 వరకు టికెట్ ధర నిర్ణయించారు. అలాగే సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు, అంటే మార్చి 19 నుంచి మార్చి 28 వరకు ప్రతి టికెట్‌పై అదనంగా రూ.100 వరకు పెంచుకునే అవకాశం థియేటర్లకు కల్పించారు.
ఇక విడుదల రోజైన మార్చి 19న ప్రత్యేకంగా బెనిఫిట్ షో నిర్వహించడంతో పాటు అదనంగా మరో ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అంటే ఆ రోజు మొత్తం ఆరు షోలు ప్రదర్శించుకునే వీలు థియేటర్ యాజమాన్యాలకు లభించింది.
ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతులతో విడుదల రోజు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


