ఖమేనీ ఆచూకీ చెబితే ప్రైజ్‌మనీ!

11
- Advertisement -

ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై సమాచారం ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతి ప్రకటించింది. మొజ్తబా ఖమేనీతో పాటు పలువురు సీనియర్ ఇరాన్ అధికారుల గురించి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.80 కోట్లకు పైగా) బహుమతి ఇవ్వనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఈ ప్రకటనను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే “Rewards for Justice” కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. అమెరికాపై ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం ద్వారా సమాచారం ఇచ్చే వారికి నగదు బహుమతి అందజేస్తారు.

అమెరికా ప్రకటించిన జాబితాలో మొజ్తబా ఖామెనీతో పాటు ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని, ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్ సహా పలువురు ఉన్నారు. వీరు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు సంబంధించిన కీలక నాయకులని అమెరికా ఆరోపిస్తోంది.

సమాచారం అందించే వారికి బహుమతితో పాటు అవసరమైతే ఇతర దేశాలకు తరలించే అవకాశం కూడా ఉండవచ్చని అమెరికా తెలిపింది. టోర్ బ్రౌజర్ లేదా సిగ్నల్ వంటి సురక్షిత మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించింది.

ALso Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ మాత్రం అమెరికా ఆరోపణలను ఖండిస్తూ, ఇది రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి చేసిన చర్య అని పేర్కొంది. ఈ పరిణామం మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -