ఇరాన్‌‌పై క్షిపణులతో అమెరికా దాడి

5
- Advertisement -

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. యుఎస్-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా దళాలు టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోని కీలక విద్యుత్ సబ్‌స్టేషన్లపై క్షిపణులతో దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా స్ట్రాటజిక్ ఒత్తిడి పెంచి, తమ డిమాండ్లను గుర్తు చేయాలని అమెరికా ప్రయత్నించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ మార్గాన్ని పూర్తిగా తెరవని ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికాకు చెందిన నౌకలకు ఇప్పటికీ ప్రవేశం నిరాకరిస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేపట్టగా, పరిస్థితి మరింత విషమించింది. ఇక ఇజ్రాయెల్ దళాలు కూడా ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులు జరిపాయి. విద్యుత్ ప్లాంట్లు, ఇంధన నిల్వ కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి.

ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. టెహ్రాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దాడులు కొనసాగితే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ప్రకటించింది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశముంది. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఇరు దేశాల్లో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -