పీయూష్..జీవితకాల వాణిజ్య మంత్రి!

4
- Advertisement -

యుఎస్ విస్కాన్సిన్‌లోని మిల్‌వాకీలో రెండు రోజుల జి20 వాణిజ్య మంత్రుల సమావేశం ప్రారంభమైన సందర్భంగా, భారత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను “జీవితకాల వాణిజ్య మంత్రి” (Trade Minister for Life) అని అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్ సరదాగా వ్యాఖ్యానించారు.

సమావేశ ప్రారంభ ప్రసంగంలో గ్రీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత మంత్రులు పదవుల నుండి నిష్క్రమించిన తర్వాత కూడా మరింత న్యాయమైన వాణిజ్య వ్యవస్థను నిర్మించే పని కొనసాగుతుందని, అయితే పీయూష్ గోయల్ మాత్రం దానికి మినహాయింపు అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల మొదటి రోజున గ్రీర్, గోయల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ప్రపంచ వాణిజ్య విధానాలను పునరాలోచించాలని పిలుపునిస్తూ, గ్రీర్ తన ప్రసంగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న అసమానతలకు కేవలం “మాటలతోనే” స్పందించాయని విమర్శించారు. సభ్యదేశాల ప్రతినిధులు స్పష్టమైన అత్యవసరతతో, కార్యాచరణ అవసరాన్ని గుర్తిస్తూ ఇక్కడి నుంచి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షతన జి20 కోసం నాలుగు ప్రధాన ప్రాధాన్యతలను ఆయన వెల్లడించారు: ఆహార ధాన్యాల ఆయుధీకరణ (weaponisation of food), నిర్మాణాత్మక అదనపు పారిశ్రామిక సామర్థ్యం, మోస్ట్-ఫేవర్డ్-నేషన్ (MFN) సూత్రం మరియు సరఫరా గొలుసులలో బానిస కార్మిక వ్యవస్థ (forced labour).

వీటిలో అత్యంత ముఖ్యమైనది MFN సూత్రం. భాగస్వామ్య దేశాలన్నింటికీ ఒకే రకమైన వాణిజ్య నిబంధనలను వర్తింపజేసే ఈ నియమాన్ని పునఃపరిశీలించాలని ఆయన అన్నారు. షరతులు లేకుండా దీన్ని వర్తింపజేయడం వల్ల విపరీతమైన వాణిజ్య విధానాలు, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే దేశాల సామర్థ్యం పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, 2016లో జి20 నాయకులు అదనపు ఉత్పత్తి సామర్థ్య సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, పదేళ్ల తర్వాత కూడా ఇది మరింత పెద్ద సమస్యగా మారిందని గుర్తుచేశారు. గడిచిన సంవత్సరంలో అమెరికా సుంకాలను (Tariffs) మరియు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉపయోగించి వాణిజ్య లోటును తగ్గించి సరఫరా గొలుసులను బలోపేతం చేసిందని చెప్పారు.

Also Read:ఇకపై ఆ పాత్రలు చేయను!

ఇలాంటి వివాదాస్పద అంశాలను జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద చర్చించాలని వచ్చే సూచనలపై స్పందిస్తూ, “జెనీవా కూడా సరస్సు ఒడ్డున ఉన్న ఒక నగరం మాత్రమే, మిల్‌వాకీ కూడా అంతే” అని వ్యాఖ్యానించారు.

సమావేశం ప్రారంభానికి ముందు, జి20 మంత్రులు మిల్‌వాకీలోని రాక్‌వెల్ ఆటోమేషన్ ప్లాంట్‌ను సందర్శించారు. అమెరికా ప్యాక్టరీలను ప్రదర్శించడానికి మరియు ట్రంప్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ఆర్థిక వ్యవస్థను చూపించడానికే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు గ్రీర్ తెలిపారు.

- Advertisement -