ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు దిగే అవకాశం చాలా తక్కువగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశాలపై చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించి, బలమైన ఒప్పందానికి వస్తే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌కు చెందిన 38 వంతెనలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు అమెరికా వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో బలమైన ఒప్పందం కుదిరితే మరోసారి సైనిక చర్యకు దిగే అవకాశం చాలా తక్కువని ఐదుసార్లు పునరుద్ఘాటించారు. ఇరాన్‌పై ఇప్పటికే విధించిన ఆర్థిక ఆంక్షలు..గతంలో చేపట్టిన సైనిక దాడుల కారణంగా ఆ దేశ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థికంగా బలహీనపడుతోందని, సైనికంగా కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఇరాన్‌ను పూర్తిగా దెబ్బతీయగలమని హెచ్చరించారు.
ఇరాన్‌కు చెందిన 38 వంతెనలను గుర్తించామని, కేవలం గంట వ్యవధిలోనే వాటన్నింటినీ కూల్చేయగలమని ట్రంప్ వెల్లడించారు. అయితే, వాటిని ధ్వంసం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఒక వంతెనను నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని, వాటిని కూల్చివేస్తే తిరిగి నిర్మించడానికి పదేళ్ల సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
మరోవైపు అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనను అమెరికా అంగీకరించాలని, లేదంటే తీవ్ర సైనిక ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read:‘దశావతారం’..రీ-రిలీజ్
ఇరాన్ విషయంలో తమ మిషన్ ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్‌పై మరోసారి దాడులు చేపట్టే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు కలిగించే ఇతర కార్యకలాపాలకు కూడా పాల్పడుతోందని విమర్శించారు. అయితే, తన ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.

