భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టుకు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా.. తాజాగా స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. మరోవైపు రెండో వన్డేలో హెల్మెట్‌కు బంతి తగిలిన బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌కు కంకషన్ ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించినప్పటికీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏడు రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో అతడు కూడా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
టీ20 సిరీస్ సందర్భంగా కుడి కాలి కండరానికి స్వల్ప గాయం కావడంతో ఫెర్గూసన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టిక్నర్ స్థానంలో రెండో వన్డేలో మాట్ ఫిషర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. అయితే టిక్నర్‌కు కంకషన్ లక్షణాలు లేవని నిర్ధారణ అయినా.. తప్పనిసరి విశ్రాంతి నిబంధన కారణంగా తదుపరి మ్యాచ్‌లు ఆడలేడు. అతడి స్థానంలో ఇప్పటికే చివరి రెండు వన్డేలకు ఎంపికైన ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్‌ను అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకున్నారు.
ఇక మరో పేసర్ మాట్ హెన్రీ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. సిరీస్‌కు ముందు డెవాన్ కాన్వేతో జరిగిన ప్రమాదవశాత్తు ఢీకొన్న ఘటనలో అతడికి గాయమైంది. కంకషన్ లేదని వైద్యులు నిర్ధారించినప్పటికీ.. రెండో టీ20లో కుడి తొడ కండరానికి స్వల్ప గాయం కావడంతో నాలుగో వన్డే నాటికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
మూడో వన్డే తర్వాత టెస్టు సిరీస్ కోసం వెల్లింగ్టన్ వెళ్లాల్సిన మాట్ హెన్రీ, కైల్ జేమీసన్ ఇప్పుడు నాలుగో వన్డే కోసం కూడా జట్టుతోనే ఉండనున్నారు. చివరి రెండు వన్డేలకు మరో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది.
టెస్టు సిరీస్ సన్నాహాల కోసం టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్ మూడో వన్డే తర్వాత బుధవారం వెల్లింగ్టన్‌కు వెళ్లనున్నారు.
ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే 0-2తో వెనుకబడింది. సిరీస్‌లో నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను కూడా కివీస్ 2-3తో కోల్పోయింది. గాయాల కారణంగా డెవాన్ కాన్వే (కంకషన్), రచిన్ రవీంద్ర (భుజం), మార్క్ చాప్‌మన్ (హ్యామ్‌స్ట్రింగ్) కూడా అందుబాటులో లేరు.
Also Read:‘దశావతారం’..రీ-రిలీజ్
మూడో వన్డేకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్.
నాలుగో వన్డేకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచెల్ హే, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్.

