తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేనేత వస్త్రాలు పంపిణీ చేశారు. హిమాయత్ నగర్‌లోని టూరిజం కార్యాలయంలో ఆయన ఉద్యోగులు, సిబ్బందికి చేనేత వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత కుటుంబాలు తీవ్ర దుర్బర పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెప్పారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ బాద్యతలు తీసుకున్న అనంతరం రాష్ట్రంలో చేనేత పరిశ్రమ పరిస్థితి బాగుపడిందన్నారు.
ఇక తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగను దేశ విదేశాలకు తెలియజేశారన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే బతుకమ్మ పండుగ సందర్బంగా మహిళలకు చేనేత వస్త్రాలు అందజేస్తుందని శ్రీనివాస్ గుప్త గుర్తుచేశారు. తెలంగాణ టూరిజం కార్పోరేషన్ తరుపున కూడా ఉద్యోగులు, సిబ్బందికి చేనేత వస్త్రాలు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ముందుగా కార్యాలయంలోని 200 మందికి చేనేత వస్త్రాలు అందించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి సోమవారం తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచి టూరిజం డిపార్టుమెంటులో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సోమవారం చేనేత వస్త్రాలు ధరించి.. చేనేత రంగం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు చేనేతలకు అండగా ఉండాలన్నారు శ్రీనివాస్ గుప్త.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్ హారికను ఎంపిక చేసుకున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ టూరిజానికి ప్రత్యేకమైన స్థానం తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకముంచి ఇచ్చిన చైర్మన్ పదవికి అన్ని విధాలా న్యాయం చేస్తానన్నారు. టూరిజంలో తెలంగాణాను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామన్నారు. పర్యాటకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా తెలంగాణకు వస్తే చాలు అన్నట్లుగా టూరిజం అభివృద్ధి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.డి మనోహర్ రావు, ఈ.డి శంకర్ రెడ్డి, శాంతి, నరసింగరావు, రవినాయక్, సునంద, ఉద్యోగులు పాల్గొన్నారు.