ఓవైసీతో కలిసి పోటీ చేస్తాం:ఆజాద్

1
- Advertisement -

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రెండు పార్టీలు సామాజిక పరివర్తన మోర్చా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి.

దళితులు, ముస్లింలను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురావడం, ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం ఈ కూటమి లక్ష్యంగా భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీకరణాల నేపథ్యంలో ఈ కూటమి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు సుమారు 19 శాతం ఉండగా, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా దాదాపు 21 శాతంగా ఉంది. ఈ రెండు వర్గాలు కలిపి రాష్ట్ర ఓటర్లలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉండటంతో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కొత్తగా ఏర్పాటైన ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 150 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.కూటమి అధికారిక ప్రకటనకు ముందు ఎంఐఎం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు షౌకత్ అలీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంఐఎం, ఎస్పీతో పాటు కాంగ్రెస్‌కు కూడా పొత్తు ప్రతిపాదనలు పంపిందని, అయితే ఆ పార్టీలు అహంకారంతో వాటిని తిరస్కరించాయని ఆరోపించారు.

Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026

బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు రాజకీయంగా సవాల్ విసిరినట్లుగానే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్‌కు కూడా గుణపాఠం చెబుతామని షౌకత్ అలీ వ్యాఖ్యానించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ పార్టీని కేవలం 27 స్థానాలకే పరిమితం చేస్తామని అన్నారు. ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ చేతులు కలపడంతో ఈ కూటమి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు సుమారు 19 శాతం, దళితులు దాదాపు 21 శాతం ఉన్నారు.

- Advertisement -