బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అరెస్ట్ అయ్యారు. ఉన్నావ్ కి చెందిన 16 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కుల్దీప్ ను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఇవాళ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.
కాగా ఇప్పటి వరకూ ఆ ఎమ్మెల్యేపై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలస్తోంది. ఐపీసీ 363 (కిడ్నాప్), 366 (మహిళల అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరత బెదిరింపులు) సహా పలు సెక్షన్ల కింద కుల్దీప్ సెంగార్‌పై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
అయితే గతేడాది జూన్‌లో కుల్దీప్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, సంవత్సరం నుంచి తనకు జరిగిన అన్యాయంపై పోరడుతున్నా అధికారులు మాత్రం తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతడి అనుచరులు అత్యాచారంపై తాను పెట్టిన కేసును సైతం వెనక్కు తీసుకోవాలంటూ బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదినట్టు ఆమె కుంటుంబం పేర్కొంది.
కాగా..ఈ నెల 8న బాధితురాలి తండ్రి పోలీసుల కస్టడీలోనే మృతి చెందడంతో మొత్తం ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.