దేశంలో అత్యంత ఎక్కువ భద్రత ప్రధానికి కేటాయిస్తారు. ఎస్పీజీ భద్రతతో ప్రధాని పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ భద్రతకు అయ్యే ఖర్చును పార్లమెంట్ వేదికగా తెలిపారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్రమోదీ భద్రతకు రోజుకు రూ.1.62కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో ఎంతమంది ప్రముఖులకు ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారని అడిగిన ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారని చెప్పారు. ఇక మొత్తంగా 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు. మొత్తం 3 వేలమంది ప్రత్యేక కమాండోలున్న ఎస్పీజీకి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో ఇది రూ.540 కోట్లు కాగా, ఈసారి దానికి పదిశాతం పెంచారు. కాగా మొన్నటి వరకు ప్రధానితో పాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా ఇటివలే కేంద్రం ఉపసంహరించింది.