టీడీపీకి ఉమామాధవరెడ్డి రాజీనామా..

232
Uma-Madhava-Reddy-
- Advertisement -

తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత ఉమా మాధావరెడ్డి ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో పదవితో పాటు  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు ప్రగతి  భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనుంది. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు పంపింది.ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి  సైతం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కొంతకాలంగా ఆమె టీఆర్ఎస్‌లో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిని ఖండించని ఆమె మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యింది. ప్రభుత్వ విధానాలు, పరిపాలనతీరు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు తమ మనోగతాన్ని కేసీఆర్‌కు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి కలిసి రావాలని నిర్ణయించుకోవటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు.

Uma Madhava Reddy to join TRS
ఉమా మాధవరెడ్డితో పాటు ఆమె అనుచరులు కొమురెల్లి నర్సింహారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నోముల మాధవరెడ్డి, చెరకు శివయ్యగౌడ్, జంగారెడ్డి, జయరాములు, భువనగిరి వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్, భువనగిరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రమేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు రెండువేలమంది టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె భర్త ఎలిమినేటి మాధవరెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో నెంబర్ 2గా ఎదిగారు. అయితే నక్సలైట్లు ఆయన్ని హత్యచేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి భూగర్భ జలవనరులశాఖ మంత్రిగా, తర్వాత మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటినుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉమా మాధవరెడ్డి  2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది.

- Advertisement -