శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే…బీజేపీ, షిండే వర్గంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారు మహారాష్ట్రను మరియు శివసేనను పూర్తిగా ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే మాట్లాడారు. తమ పార్టీని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శివసైనికులు గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ పాలకుల ముందు మోకరిల్లడానికి నిరాకరించినందుకే తమపై పగబట్టారని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్ర అస్తిత్వాన్ని, మన శివసేనను ఖతం చేయడమే వారి ఏకైక లక్ష్యం. కానీ మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నా శివసైనికులు అలాంటి కుట్రలను సాగనివ్వరు. మన పులులను (శివసేన నాయకులను) లొంగదీసుకోవడానికి వారు రకరకాల ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా శివసేనను ఆపలేరు అని థాక్రే స్పష్టం చేశారు.
మహారాష్ట్ర సంపదను, ఇక్కడి ప్రాజెక్టులను వేరే రాష్ట్రాలకు తరలిస్తూ, ముంబై ప్రాధాన్యతను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేసి, తమకు అండగా నిలుస్తారనే నమ్మకాన్ని ఉద్ధవ్ థాకరే వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారి గురించి తానేమీ బాధపడటం లేదని నిజమైన ‘పులులు’ ఇప్పటికీ తనతోనే ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read:GIC:తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం

