వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మరియు ఇతరులపై ఉన్న లంచం ఆరోపణల కేసును అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) ఉపసంహరించుకోవాలని (కొట్టివేయాలని) కోరినప్పటికీ దీనిపై తుది నిర్ణయం న్యాయమూర్తి చేతిలోనే ఉంటుందని న్యూయార్క్‌కు చెందిన ప్రసిద్ధ క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాది టోనీ మిర్విస్ స్పష్టం చేశారు. అయితే సాధారణంగా ప్రాసిక్యూషన్ (ప్రభుత్వ పక్షం) కేసును ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నప్పుడు న్యాయమూర్తులు దానికి అంగీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
అదానీపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మోషన్ (అభ్యర్థన) దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయవాది టోనీ మిర్విస్ స్పందించారు. ఈ విషయంపై ఏఎన్‌ఐ (ANI) వార్తాసంస్థతో మాట్లాడిన టోనీ మిర్విస్.. కేసు ఉపసంహరణ ప్రక్రియను వివరించారు. సాధారణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక కేసును కొట్టివేయాలని నిర్ణయించుకున్నప్పుడు వారు కోర్టులో ఒక మోషన్ దాఖలు చేస్తారు. ఈ మోషన్‌ను న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రాసిక్యూషన్ కేసును కొనసాగించడానికి ఇష్టపడనప్పుడు న్యాయమూర్తులు దానికి అంగీకరించడం సర్వసాధారణం అని ఆయన చెప్పారు.
కేసును కొట్టివేయడానికి గల కారణాలను వివరిస్తూ.. కేసును ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి కారణాలైనా చెప్పవచ్చు. సాక్ష్యాలు సరిపోకపోవడం కావచ్చు, లేదా కేసును ముందుకు తీసుకెళ్లడం వల్ల న్యాయం జరగదని భావించడం కావచ్చు, లేదంటే విదేశాంగ విధానాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన విస్తృత ప్రయోజనాలు కూడా దీనికి కారణం కావచ్చు అని మిర్విస్ పేర్కొన్నారు. కేసు కొట్టివేత ప్రక్రియ ఎంత సమయం పడుతుందనే దానిపై స్పందిస్తూ.. న్యాయమూర్తి ఈ మోషన్‌పై సంతకం చేయడానికి ఎంత సమయం పడుతుందనేది ఆయా కోర్టుల పనితీరు మరియు న్యాయమూర్తి షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని రోజులు పట్టవచ్చు లేదా కొన్ని వారాల సమయం కూడా తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు.
గతంలో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన పౌర (సివిల్) మోసాల కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.
Also Read:GIC:తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం

