ఆసక్తి రేపుతున్న తమిళ రాజకీయం

224
Two men who may run Tamil Nadu
- Advertisement -

తమిళనాడు అనిశ్చితికి తెరపడిందని అంతా భావిస్తుండగానే బలపరీక్ష రూపంలో ముఖ్యమంత్రి పళని స్వామికి అగ్నిపరీక్ష ఎదురైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు బలపరీక్షకు రంగం సిద్దమైంది. పన్నీర్ సెల్వం, డీఎంకే,కాంగ్రెస్‌ పార్టీలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించడంతో దేశ వ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పళని క్యాంపులో 123 మంది ఎమ్మెల్యేలు  ఉండగా కొంతమంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళని రంగంలోకి దిగారు.

ఇక ఇదిఇలా ఉండగా పన్నీర్ వర్గీయులు ముఖ్యమంత్రి పళనితో సహా మంత్రివర్గ సహచరులందరిని అన్నాడీఎంకే నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సంచలన సృష్టించారు. కార్యకర్తలంతా తమ వైపే ఉన్నారని తమదే అసలైన అన్నాడీఎంకే అని మధుసుదన్ ప్రకటించారు. అంతకముందే శశికళతో పాటు ఆమె బంధువు దినకరణ్‌ను అంతకముందే పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తప్పించారు.

ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, పళనిని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ… మైలాపూర్‌ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్‌ తాజాగా పన్నీర్‌ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్‌ సెల్వం విజ్ఞప్తి చేశారు.

కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్‌ డిమాండ్‌ చేస్తూ పన్నీర్‌ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి.

తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్‌ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు.

1988లో ఎంజీ రామచంద్రన్‌ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్‌ పీహెచ్‌ పాండ్యన్‌ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది.

శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -