డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాకిచ్చింది ట్విట్టర్. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ట్రంప్ ట్వీట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ దేశాల అధినేతలకు కొన్ని మినహాయింపులు ఇస్తూ వస్తున్న ట్విట్టర్ ట్రంప్‌కు షాకిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఫేస్‌బుక్ తాత్కాలికంగా ట్రంప్ ఖాతాను ఈ నెల 20వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా ట్రంప్ ఖాతాను నిలిపివేసే ఆలోచనలో ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం ద్వారా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడులకు ట్రంప్ ఉసిగొల్పారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు పేర్కొన్నాయి. ప్రపంచ నేతల ఖాతాల విషయంలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నప్పటికీ నిబంధనల హద్దులను పూర్తిగా దాటితే చర్యలు తప్పవని ట్విటర్ తాజాగా స్పష్టం చేసింది.