సొంతంగా మెజార్టీ దిశగా TVK!

0
- Advertisement -

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆగస్టులో జరగనున్న ఉపఎన్నికల్లో వీరికి టీవీకే తరఫున టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు 10 సీట్లు తక్కువగా నిలిచింది. అనంతరం విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయడంతో పార్టీ బలం 107కు తగ్గింది.

కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాల బాహ్య మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ప్రభుత్వానికి 120 మంది సభ్యుల బలం లభించింది.

ఎన్నికల్లో 47 స్థానాలు గెలిచిన ఏఐఏడీఎంకేలో ఎన్నికల ఫలితాల తర్వాతే విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 41కు పడిపోయింది. ఇప్పుడు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ఏఐఏడీఎంకే బలం 31కు తగ్గిపోతుంది. వీరంతా ఉపఎన్నికల్లో టీవీకే అభ్యర్థులుగా పోటీ చేసి గెలిస్తే విజయ్ పార్టీ బలం 117కు చేరుతుంది. ఆ తర్వాత మరో ఒక్క ఎమ్మెల్యే మద్దతు లభించినా టీవీకే సొంతంగానే 118 స్థానాల మెజారిటీని సాధించే అవకాశం ఉంటుంది.

Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!

- Advertisement -