పర్యావరణ హితం కోరుతూ సీడ్ బాల్స్ ను విసిరే ( సీడ్ బాంబింగ్ ) కార్యక్రమాన్ని చిల్కూరు మృగవని పార్క్‌లో టీవీ9 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోపాటు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో 17 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్, నటుడు రాజేంద్ర ప్రసాద్, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ హజరయ్యారు. విద్యార్థులు, ఎన్జీఓలతో కలిసి తయారు చేసిన 5లక్షల సీడ్ బాల్స్‌ను అతిథులు, పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఖాళీ స్థలాల్లో విసిరారు. గ్లోబల్ వార్మింగ్ తో గతి తప్పుతున్న జీవ వైవిధ్యం బ్యాలెన్స్ చేయడానికి విస్తృతంగా మొక్కలు పెంచడమే ఉత్తమ మార్గమని నమ్మింది. విస్తృతంగా మొక్కలు పెంచడానికి సీడ్ బాల్స్ కాన్సెప్ట్ ఎంచుకుని .. సుస్థిర వ్యవసాయ కేంద్రం సీఎస్‌ఏ, సహజ ఆహారం సంస్థలతో కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. 2022 ఆగస్ట్ 1 నుండి 18 వరకు సహకార సంఘాలు , విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ ఆవశ్యకత, వాటి తయారీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
సీడ్ బాల్ క్యాంపెయిన్‌కి తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన వచ్చింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమంలా సీడ్ బాల్ ప్రోగ్రాం సాగింది. విద్యార్థులు, ఎన్జీఓలతో కలిసి తయారు చేసిన 5 లక్షల సీడ్ బాల్స్ ను సీడ్ బాంబింగ్ కార్యక్రమాన్ని ఆగస్ట్ 18న చిల్కూరు మృగవని పార్క్‌లో టీవీ9 నిర్వహించింది.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం టీవీ 9 చేస్తున్న సీడ్‌బాల్ క్యాంపెయిన్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. జీవ వైవిధ్యం సమతుల్యత కోసం సీడ్ బాల్స్ ద్వారా మొక్కలు పెంచడం, మొక్కల యొక్క వాటి అవశ్యకత గురించి మంత్రి వివరించారు.
విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మొక్కలు మానవాళికి ఏంతో ఉపయోగపడుతాయని తెలిపారు. 5లక్షల సీడ్‌బాల్స్ తయారు చేసి విసరడం ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీడ్ బాల్స్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసిన టీవీ9 బృందంకు కృతజ్ఙతలు తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత వాటిని సంరక్షించడంకోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కదలాలి అని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమం భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకునుగుణంగా పర్యావరణ పరిరక్షణ చెపట్టాలన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్‌లో 50 లక్షల సీడ్స్ బాల్స్ విసిరేలా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకుపోయి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో భాగం కావడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమన్నారు. ప్రకృతి మనకు అన్ని ఇచ్చిన ఇంకా కావాలని అత్యాశతో మనం అడవులను నాశనం చేసుకుంటున్నామన్నారు. మనమే బాగుండాలంటే స్వార్థం అవుతుంది. అదే అందరి కోసం మనం పని చేయాలంటే నిస్వార్థం అవుతుంది. టీవీ9 చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం మనం వారి బాగోగుల కోసం మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎఫ్‌డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, డీఎఫ్ఓ లు ఎం. జోజి, విజయా నంద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.