ఎంపీ అరవింద్‌కు షాక్‌.. మరోసారి పసుపు రైతుల ఉద్యమం..!

86
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో మరోసారి పసుపు రైతుల ఉద్యమం రాజుకుంటోంది. ఇప్పటికే పసుపు బోర్డు విషయంలో దగా చేసిన బీజేపీ ఎంపీ అరవింద్‌పై రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో నిజామాబాద్‌కు పసుపుబోర్డు తీసుకువస్తా అని బాండు పేపర్ రాసిచ్చిన అరవింద్‌ మాయమాటలను నమ్మిన రైతన్నలు గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించారు. తీరా ఎన్నికల్లో గెలిచాక ధర్మపురి అరవింద్‌ కాస్తా అధర్మపురి అర్వింద్‌గా మారిపోయాడు. మూడున్నరేళ్లు అవుతున్నా పసుపు బోర్డు తీసుకురాలేదు సరి కదా..బోర్డు గురించి నిలదీస్తే వారిపై టీఆర్ఎస్ ముద్రవేసి ఎదురుదాడి చేస్తున్నాడు. అయితే అరవింద్‌ బూటకపు మాటలను మరోసారి నమ్మి మోసపోయేందుకు పసుపు రైతులు సిద్ధంగా లేరు. అందుకే నిజామాబాద్ జిల్లాలో అరవింద్‌ను అడుగుడుగునా అడ్డుకుంటూ నిరసన తెలుపుతున్నారు.

అయితే తాజాగా పసుపు రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవడం బీజేపీ ఎంపీ అరవింద్‌ను టెన్షన్ పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటాల్‌ పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన రైతు వేదిక నాయకులు సమావేశమై తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు.

జగిత్యాల రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు మామి డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర జాబితాలో పసుపును చేర్చాలని, మూతపడ్డ నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని, ఎర్రజొన్నలను క్వింటాల్‌కు రూ.4,500 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కోరుతూ మహా పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ముత్యంపేట్‌ నిజాం చక్కెర ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. మొత్తంగా పసుపు రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవడంతో బీజేపీ ఎంపీ అరవింద్‌కు మున్ముందు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని నిజామాబాద్ జిల్లాలో చర్చ జరుగుతోంది.

- Advertisement -