తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో టీ కాంగ్రెస్ రెండు జాబితాల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాల విషయంలో ఇంకా కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో కొంతమంది కీలక నేతలకు ఈసారి గెలుపు కష్టమే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలలో ముఖ్యనేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటివారికి ఈసారి ఓటమి తప్పదని ఆల్రెడీ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గతంలో వీరు అధికార బిఆర్ఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో పొంగులేటిని బిఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. .
ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు. నియోజిక వర్గ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో హస్తం హైకమాండ్ పొంగులేటికే సీటు కేటాయించింది. ఇక ఖమ్మం నియోజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. బిఆర్ఎస్ మొదట ఈయనకు సీటు నిరాకరించడంతో హస్తం గూటికి చేరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి బిఆర్ఎస్ తరుపున పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. పువ్వాడ ను ఢీ కొట్టి తుమ్మల నిలవడం కష్టమే అని ఇప్పటికే సర్వేలు కూడా తేల్చి చెప్పాయి.
ఇక మునుగోడు విషయానికొస్తే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈయన నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సీటు నిరాకరించడంతో తిరిగి హస్తం గూటికి చేరారు. గత కొన్నాళ్లుగా నియోజిక వర్గ ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ కారణంగానే మునుగోడు ఉపఎన్నికల్లో కూడా ఘోర ఓటమిపాలు అయ్యారు. దాంతో సాధారణ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డికి ఓటమి తప్పదని చెబుతున్నారు విశ్లేషకులు. ఇంకా మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగుతున్న మైనంపల్లి హనుమంతరావు హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ వంటి వారికి కూడా గెలుపు కష్టమే అని తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:కాంగ్రెస్లో టికెట్ల చిచ్చు!