కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా కైశిక ద్వాదశిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమల వసంత మండపంలో శ్రీ తులసి దామోదర పూజ ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఎదురుగా తులసి, ఉసిరి వృక్షాలను కొలువుదీర్చారు. ఈ సందర్భంగా పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి మాట్లాడుతూ శ్రీ తులసి దామోదర పూజ విశిష్టతను తెలియజేశారు. కార్తీక మాసంలో ఈ పూజ చేయడం వల్ల పితృదేవతలు విష్ణుసాన్నిధ్యాన్ని చేరుతారని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పారు. తులసిని పూజిస్తే గ్రహబాధలు తొలగుతాయని, సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని వివరించారు.
అనంతరం కార్తీక విష్ణుపూజా సంకల్పం, బ్రహ్మాది దేవతలకు ఆరాధన చేశారు. ఈ సందర్భంగా పండితులు కృష్ణ అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. నివేదన, క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌కి దెబ్బేసిన శివాజీ