టీ ‘టీడీపీ’ అయోమయం?

16
- Advertisement -

తెలంగాణలో టీడీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారా ? లోక్ సభ ఎన్నికల్లో పోటీపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతలు తలోదారి చూసుకుంటున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత స్థిరమైన ఓటు బ్యాంకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపాలని అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నించారు. ఎన్నికల ముందు టీటీడీపీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహించడం, రాష్ట్రంలో పర్యటించడం చేస్తూ వచ్చారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు అనూహ్యంగా జైలుకు వెళ్ళడంతో తెలంగాణలో ఒక్కసారిగా టీడీపీ సైలెంట్ అయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ వీడి బి‌ఆర్‌ఎస్ లో చేరారు..

ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి టీడీపీ పోటీపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించినప్పటికి కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీపీ నేతలు ఇతర పార్టీల గూటికి చేరేందుకు దారులు వెతుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం సాధించే లక్ష్యంతో ఉంది. ఆందుకే తెలంగాణ పై ఆ పార్టీ ఫోకస్ తగ్గించినట్లు విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే టీడీపీ తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకోవడం వల్ల రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. ఆందుకే కనీసం నామాత్రంగానైనా ఆ పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదనేది కొందరి అభిప్రాయం. మరి తెలంగాణ విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో చూడాలి.

Also Read:రికార్డులు క్రియేట్ చేస్తున్న..పుష్ప‌-2

- Advertisement -